ఆ రాయే రత్నమైంది
హాయ్ నేను చందు. మధు లవర్ని. బయట సందేశ్ అన్నా పలుకుతాను. నేను సినిమాల్లోకి రావడం అంతా ఓ కలగా ఉంది. అమెరికాలోని న్యూజెర్సీ ఓ రోజు నెట్లో ఉండగా కొత్త నటీనటులు కోసం శేఖర్ గారిచ్చిన ప్రకటన చూశా. ఓ రాయేద్దాం అనుకున్నా. అది రత్నంలాంటి అవకాశాన్నిచ్చింది. నేనక్కడ ప్లస్‌టూ చదువుతున్నా. జూన్‌లో పరీక్షలు. అయినప్పటికీ రివ్వున ఎగిరొచ్చి ఆంధ్రాలో వాలా. ఐదేళ్ల వయసులో అమెరికాకు వెళ్లిపోయినా, నా మూలాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. రెండేళ్లకోసరి ఇండియా వచ్చేవాణ్ని. న్యూజెర్సీలోని మా ఇంట్లో హాయిగా తెలుగులో మాట్లాడుకుంటాం. సినిమాలో చందు కాస్త కూల్. బయట నేనాలా కాదు. చాలా చిలిపి. యమా స్పీడు. బాస్కెట్‌బాల్, అమెరికన్ పుట్‌బాల్ ఇష్టమైన ఆటలు. ఐతే మొదటిసారి కదా... మధుతో రొమాంటిక్ సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు కొద్దిక్షణాలు ఇబ్బందిపడ్డా. ’ఇదంతా నటన... బీకూల్’ అంటూ తను టెన్షన్ పోగొట్టింది. ఇండియాలో సినిమా రిలీజ్ కాగానే గబగబా అమెరికా వచ్చేశాను. పరీక్షలు రాయాలిగా! నేనిక్కడ బ్రిలియంట్ స్టూడెంట్‌ని. ఆ ర్యాంకు కాపాడుకోవడం కోసం పుస్తకాలతో కుస్తీ పడుతున్నా. కానీ ఎప్పుడెప్పుడు ఆంధ్రాకు వచ్చేస్తానా అని ఉంది. నాలుగైదు అవకాశాలూ తలుపు తడుతున్నాయి. ఓహ్ సారీ... మీకు చెప్పలేదు కదూ... అమెరికాలో హ్యాపిడేస్ సూపర్ హిట్.
ఆరునెలల కోర్సు అదుర్స్
హలో నేను మధు. అసలు పేరు తమన్నా. పరికిణీ, ఓణీలో తెలుగమ్మాయిలా కనిపించాను కదూ! కానీ మాది ముంబై. పుట్టింది, పెరిగింది అక్కడే. 12 ఏళ్ల వయసులో థియేటర్ వైపు వచ్చాను. ఆ తరువాత నటన, నాటకాలతోనే సరిపోయింది. పదో క్లాసు నుంచి స్కూలుకెళ్లడం తగ్గిపోయింది. కరస్ఫాండెన్స్ కోర్సులో ఇంటర్ చదువుతున్నా. ’ఫేయిర్ అండ్ లవ్లీ’తో మోడలింగ్‌లో పేరొచ్చింది. ’శ్రీ’తో తెలుగు సినిమాల్లో అడుగుపెట్టా. హ్యాపీడేస్ నేను కాలేజీకెళ్ల్లని లోటుని తీర్ఛింది. ఏకంగా ఆరు నెలలు సీబీఐటీ కాలేజీలో ఉండే అవకాశం లభించింది. నా తీరుకి మధు క్యారెక్టర్ అతికినట్టు సరిపోతుంది. నేను స్పీడు కాదు. అలాగని స్లో కాదు. ఒద్దికగా ఉంటాను. సౌకర్యంగా ఉండే భారతీయ దుస్తుల్నే ధరిస్తాను. పార్టీలకు వెళ్లను. అంత తీరిక లేదు. పదిహేడేళ్ల అమ్మాయిని. అమ్మానాన్నలు కంటికి రెప్పలా చూసుకుంటారు. అందం, నటన... రెండూ బావుంటేనే ప్రశంసలని నాకు తెలుసు. ఆదరించిన ఆంధ్రా యూత్‌కి థ్యాంక్స్.
No comments:
Post a Comment